17, అక్టోబర్ 2012, బుధవారం
8, అక్టోబర్ 2012, సోమవారం
శ్రీశ్రీశ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి వారి చరిత్ర
త్రేతాయుగము నందు లంకలో రావణాసుర సంహారం అనంతరం సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రామచంద్రుడు ఆంజనేయ సహిత పరివార సమేతముగా పుష్పక విమానము పై అయోధ్యా నగరమనకు ప్రయాణము అయ్యారు. మార్గమధ్యములో ఉన్న (తూర్పు సముద్రం ) బంగాళాఖాతం తీరప్రాంతము నందు ఉన్న సుమంచ పర్వతము వద్ద కొద్ది సేపు విశ్రాంతి కొరకు విడిది చేసారు. ఆ సమయములో అనుచరగణంలో ఉన్న సుశేణుడు అనే వానర వైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషధ, మూలికా వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. కాని చుట్టూ ఔషధాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండుట అతనిని ఆశ్చర్యపరచినది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాది ఈతిబాధల నివారణార్ధం తను ఏదైనా చేయలని తలంచాడు. బొందితో కైలాసం
చేరుకోవాలనే తన పూర్వవాంఛితము నెరవేర్చుకొనుటకు కూడా ఇదేమంచి ప్రదేశముగా
అతనికి అనిపించినది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరచి తను ఈ సుమంచ
పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకొంటున్నట్లుగా చెప్పాడు. శ్రీరాముడు అతని
వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార, అనుచరజనాలతో అయోధ్యకు వెళ్లిపోయాడు.
తరువాత సుశేణుడు సుమంచ పర్వతంపై శివుని గూర్చి ఘోర తపస్సు చేయనారంబించాడు.శ్రీ రామ పట్టాభిషేకము తరువాత కొంతకాలానికి సుశేణుడు ఎలా ఉన్నాడో క్షేమసమాచారాలు చూసిరమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు
సుమంచ పర్వతప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుశేణుడు కనిపించలేదు కాని
అతని కళేబరం కనిపించినది. సుశేణుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు
భావించి దుఃఖముతో అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరచి సుశేణుని యొక్క కళేబరమును అందులో
ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరకిన మల్లెపూలను ఆప్రదేశంలో ఉంచి దానిపై జింక
చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు అయోధ్యకి వెళ్తాడు. హనుమ
ద్వార విషయము తెలుసుకున్న రాముడు సీత, లక్ష్మణ హనుమలతో కలసి సుమంచ పర్వతానికి వస్తాడు. సుశేణుని కళేబరమును రామునికి చూపుటకు జింక చర్మాన్ని పైకి లేపుతాడు హనుమ. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానములో మల్లెపువ్వులతో కప్పబడి ఉన్న శివలింగము కనిపిస్తుంది. ఆ రోజు కార్తీక శుద్ద ఏకాదశి, తులా సంక్రమణము. ఆ శుభముహుర్తములో శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ప్రక్కన
గల కొలనులో స్నానము చేసి వశిష్ఠ మహర్షి అధ్వర్యములో శివలింగాన్ని పూజించుట ప్రారంబించగానే ఆ శివలింగము
క్రమముగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ,మూలికల సువాసనలతో కూడిన గాలి
శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు
మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం, ఒకరకమైన శక్తి తేజస్సు రావడం గమనిస్తారు. శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకొన్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విరమిస్తాడు. అప్పటి నుండి ఈ శివలింగము పెరిగి పెరిగి మహాలింగముగా ఆవిర్భవించినది. మల్లెపూల తో పూజింపబడి జినంతో{చర్మం} కప్పబడి ఉన్నపుడు వెలసిన స్వామి కనుక మల్లికాజిన స్వామిగా రాములవారు నామకరణము చేసారు. తరువాత సీతారాములు ఒక రాతిపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా సీతాదేవి పాదాలు రాతికి అతుక్కుపోయినాయి. అప్పుడు రాముల వారు తన చేతి స్పర్శ తో ఆ పాదాలని విడదీసారు. దీనికి కారణము ఏమని సీత అడుగగా ఈ క్షేత్రము రాబోయే యుగాలలో ప్రశిద్ద క్షేత్రముగా విరాజిల్లునని రాముల వారు చెప్పారు.
ఇప్పటికీ ఆలయానికి ఎదురుగా రామచండి అనే పేరుతొ సీతాదేవి పాదముద్రలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి
ద్వాపర యుగం లో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చారు. పాండవ మధ్యముడైన అర్జునుడు ఇక్కడ స్వామి వారి కోసం తపస్సు చేయగా స్వామి వారు ప్రత్యక్షమై వరము కోరుకొనమనగా స్వామి నీ పేరు వెనుక నా పేరు ఉంచి కలియుగములో మన ఇద్దరి పేరుతొ ఈ క్షేత్రము ప్రశిద్ది చెందాలని వరము కోరుకుంటాడు. అప్పటి నుండి మల్లికాజినుడు పేరు మారి మల్లికార్జునుడు గా ప్రఖ్యాతిగాంచాడు.
టెక్కలి రాజా వారు రఘునాధ బృందావన హరిచందన జగద్దేవ్ దేవాలయమును క్రీ .శ. 1824 లోనిర్మాణానికి పూనుకున్నారు. కాని ఏదినము గోడలు ఆ దినము కూలిపోవడము జరిగింది. తదుపరి ఒక దినం స్వామి వారు రాజా వారికి కలలో ఒక దివ్యరూపములో కనిపించి రాజా! నేను దేవ వైద్యుడైన సుశేణుని తపో ఫలితముగా వెలసినాను. నాపై సోకిన గాలి ప్రజలకి సోకి ఆరోగ్యవంతులు అవ్వాలని అతని కోరిక కావున నాపై సోకిన గాలితో ప్రజలు ఆరోగులవంతులు అవుతారు. కావున ఆలయ నిర్మాణము వద్దని, ఎండల మల్లిఖార్జున స్వామి అనే నామముతో స్థిరపడతానని తెలియజేసారు.
నాటి నుండి రాజా వారి నిర్దేశం ప్రకారం ఆచార వ్యవహారాలతో తర్లా వంశీకుల చేత నేటికీ 18 తరహాలుగా స్వామి వారి సేవలు నిర్వహించబడుతున్నాయి. తదుపరి 1929 వ సంవత్సరములో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయము చేర్చబడినది.
సీతకుండములో స్నానం చేసి భక్తితో స్వామివారికి అభిషేకము చేసినవారికి దీర్ఘకాలిక వ్యాదులు , చర్మవ్యాదులు మరియు సంతానలేమి వంటి దోషములు, సర్వవ్యాదులు నివారించబడుతాయని భక్తుల విశ్వాసము.
ప్రత్యేకతలు
నేటికీ సంవత్సరమునకు ధాన్యపు గింజ ప్రమాణములో లింగ పరిమాణము పెరగడం విశేషము.
ఈ ఆలయము పశ్చిమ ముఖ ఆలయం.
ఏకశిల స్వయంభూలింగం గా ప్రసిద్ధి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)